వనభోజనాలు

కార్తీకమాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం.  కార్తీకమాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశము తక్కువై, త్రిదోషాలు వికృతి చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని పెద్దలు అంటారు.  వన భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు, సమైక్యతకు దోహదం చేస్తుంది.

భగవంతుడంటే ప్రకృతి. ప్రకృతికి సమస్త జీవరాశుల పట్ల సమభావమే. వనం కూడా ప్రకృతిలో భాగమే. వనదేవత  కుల, మత, లింగ, వర్గ, జాతి భేదాలు చూడదు.  అందరినీ చల్లగా చూస్తుంది. 
మనం పుట్టినపుడు వనం ఉయ్యాల అవుతుంది. 
మనం పోయినప్పుడు వనం కట్టెలౌతుంది.
నడుమ ఆశ్రయమిస్తుంది, ఆకలిదప్పులు తీరుస్తుంది.
వనం అంటే మనం.
వనం లేక మనం లేం. మనలేం.
కానీ మనం ఏం చేస్తున్నాం?
మనిషికి స్వార్థం పెరిగే కొద్దీ వనాలు చిన్నవౌతున్నాయి. 
జీవరాశి వైవిధ్యం ఛిద్రమౌతోంది. 
ఇప్పుడు జరుగుతున్న కులభోజనాలు చూసి వనాలు  చిన్నబోతున్నాయి.

1 thoughts on “వనభోజనాలు

వ్యాఖ్యానించండి