అ – అమ్మ

నేను రాసిన “అ – అమ్మ” కథ అత్తివిల్లి శిరీష జ్ఞాపకార్థం శ్రీమతి & శ్రీ అత్తివిల్లి బాల సుబ్రహ్మణ్యం సహకారంతో పాలపిట్ట మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది. పాలపిట్ట ఫిబ్రవరి 2024 సంచికలో ప్రచురితం.

https://dtxj.short.gy/అ-అమ్మ

ఏకాంత సాంత్వనము – 6

శిథిలమౌతున్న మన ప్రేమ గురుతులు ఒకనాటికి విహార ప్రదేశాలవుతాయి.

  • కొన్ని తరాలు గడిచాక చరిత్రని మన భగ్నప్రేమ కథకి ముందు, ఆ తర్వాత అని చెప్పుకుంటారు. 
  • ఏడాదికో, ఏణ్ణర్థానికో పొలమారినపుడు ఎక్కడ ఉన్నావో తెలియని నువ్వే తలచుకుంటున్నావని ఒక సాంత్వన.
  • మన ప్రేమ అధ్యాయాన్ని కనులు మూసుకుని, చేతులు కట్టుకుని ఎన్నిసార్లు మననం చేసుకున్నానో. ఇపుడు కంఠోపాఠమైపోయింది. 
  • నా ప్రేమకి విలువని కడుతూనే ఉన్నారు. అనంతమే (infinity) చిన్నబోయింది. 
  • శిధిలమైన ప్రేమ వంతెన. నువ్వూ, నేనూ చెరోవైపు.
  • విరిగి ముక్కలైన నా మనసులోనూ నీ వేల ప్రతిబింబాలు.
  • ప్రేమ జపమాలలో ఎన్ని పూసలు! నీ సాక్షాత్కారం కోసం ఈ జన్మ చాలదేమో. 
  • బంజరు భూమి, దిగులు మొయిలు, ఊపిరాడని గాలి, కన్నీటి సంద్రం, ఎడబాగ్ని – ఇవే మన ప్రేమకి సాక్ష్యాలు.
  • ఎల్లలు లేని ప్రేమ అంటారు కదా. మరి మన మనసుల మధ్య నువ్వు గీసిన ప్రేమాధీనరేఖ సంగతేమిటి?
  • ఈ సాంత్వన పలుకులకి ఎన్నటికైనా రెక్కలొచ్చి నిన్ను చేరేనా?

Seriously

ఈ మధ్య మా కాలనీ ఉద్యానవనంలో జరిగిన చర్చా కార్యక్రమం. 

వీధికుక్కల దాడుల్లో గాయపడిన వారి పట్ల విచారం వ్యక్తం చేసాం.
ఎవరికి తోచిన పరిష్కారాలు వాళ్ళు చెబుతున్నారు.

“అలా అని కుక్కల్ని చంపలేం” ముక్క లేనిదే ముద్ద దిగదని పేరున్నాయన అన్నాడు.    
“అవును. కుక్కల్ని చంపకూడదు. కోళ్ళని, మేకల్ని చంపి లొట్టలేసుకుంటూ తినొచ్చు” ఓ వేగానోపాసకుడు.
“పెట్టుబడిదారీ విధానాల వల్లే మనుషులకి తప్ప మిగిలిన జీవరాశికి విలువ లేకుండా పోయింది” అతనికి రెండు ఇళ్ళు, మూడు ఫ్లాట్లు, నాలుగు స్థలాలు ఉన్నాయి.
“చైనాలో కూడా పిచుకల్ని, కుక్కల్ని చంపేసారట”
“బహుశా అవి పార్టీ సభ్యత్వం తీసుకుని ఉండవు”

“ఏది ఏమైనా ఒక ప్రాణిని చంపడం నాగరీకం కాదు. అయితే గియితే ఏదో ఒక కేసు పెట్టి లోపల తొయ్యొచ్చు” ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకేసే ఆయన అన్నాడు.
“అవును. ఏ పోస్టరో, బ్యానరో చించేసిందని…”

విషయం ఎటునుండి ఎటో వెళ్ళి తన్నుకునేలా ఉన్నారని గ్రహించాను. కాలనీవాసులకి, ముఖ్యంగా పిల్లలకి ఈ విషయమై అవగాహన కల్పించాలని తీర్మానం చేసి వందన సమర్పణ చేసేసాను.  

గూడు

“హోయ్. ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు”
“ఇల్లు మారాం”
“అదేంటి మీరుండేది బానే ఉంటుంది కదా?”
“ఇంటి యజమానితో పడలేకపోతున్నాం బాబూ. కయ్‌కయ్‌మంటుంటాడు. అందుకే కళ్యాణ్ నగర్ నాలుగో రోడ్‌లో శక్తి  అపార్ట్‌మెంట్స్‌కి మారిపోయాము”
“ఎన్నో ఫ్లోర్?”
“నాలుగు.  403”
“నీళ్ళ సమస్యేం లేదు కద”
“లేదు”
“పిల్లలెక్కడ”
“నాంపల్లిలో. అప్పుడప్పుడు వస్తుంటారు. మేమూ వెళుతుంటాం”
“మేమూ ఇల్లు మారాలి”
“ఎందుకు?”
“మా ఫ్లాట్స్‌కి వలలు (నెట్స్) కట్టేస్తున్నారు”

 హైదరాబాద్‌లో రెండు పావురాల మధ్య సంభాషణ. 

ఎండ

కవిత రాద్దామని ఎ.సి. ఆన్ చేసి కూర్చున్నాను.

ఎండాకాలం రాగానే ముందుగా ఎ.సి. కనిపెట్టినాయనకి నివాళులర్పిస్తాను.   

మా ఆవిడ లోపలికి వచ్చింది. “చేస్తున్నంత కాలం ఆ ఉద్యోగమూ, ఇప్పుడీ కంప్యూటరే నాకన్నా మీకెక్కువయ్యాయి అని దెప్పి పొడుస్తోందని మాట కలపడానికి  “అబ్బ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి” అన్నా.
“ప్రతీ సంవత్సరం ఇదే మాట అంటారు. పోయినేడాదీ ఎండలు ఎక్కువగా లేవూ”
“ఉన్నాయి, ఉన్నాయి. గుర్తుందా ఎండాకాలం అని ఎవరో సినిమా కూడా తీసినట్టున్నారు”

కవితకి ‘మండే ఎండలు’ అని శీర్షిక పెట్టానని ఒక మిత్రుడికి చెప్పా. మండే ఎండలు, ట్యూస్‌డే ఎండలు ఏంటి నీ పిండాఫుడ్డు అని కోప్పడ్డాడు. ఆ రోజు సోమవారం. అయినా కవిత్వం అర్థం చేసుకోలేని స్నేహితులుండడం కవికి పూర్వజన్మ శాప ఫలితం. ఆ స్నేహితుల సుకృతం.

కవితలో రెండు పాదాలు బానే కుదరగానే ‘ఎపుడూ లేని ఈ సంతోషాలే దాచాలంటే మది చాలో ఏమో’ అంటూ సిద్ శ్రీరామ్ పాటని హమ్ చేసాను.
“పాటలు మామూలుగా బాగానే పాడాతారుగా. ఈ పాట పాడడానికి ముక్కు అరువు తెచ్చుకోడమెందుకు” అని శ్రీమతి విసుక్కుంది. 

మూడో పాదం కుదరడం లేదు. పరీక్ష రాస్తున్నపుడు సమాధానం తట్టకపోతే కిటికీలోనుండి బయటకు చూసినట్టు ఓ చూపు విసిరాను.  

చెప్పులు కుట్టే అతను ఆ ఎర్రటి ఎండలో డివైడర్‌పైనే నెత్తిన ఓ తాటాకు ఛత్రంతో బిచాణా పెట్టేసాడు. జాలేసింది. రెడ్ సిగ్నల్ దగ్గర స్కూటర్‌వాలాలు అసహనంతో చిటపటలాడిపోతున్నారు. పాపం ఓ బాటసారి చెట్టు నీడ కోసం వెతుక్కుంటున్నాడల్లే ఉంది. ఇంకెక్కడి చెట్లు? కరెంట్ తీగలు, కేబుల్ వైర్ల గజిబిజి జీవితానికి అడ్డంగా ఉన్నాయని కొమ్మలన్నీ కొట్టేసారు. ప్రధాన రహదారి పక్కనే అవడంతో ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే స్పూర్తిబాబు మంచి పేరు కొట్టెయ్యడానికి దుకాణం పెట్టేసాడు. అదే, చలివేంద్రం! వీడి క్రియేటివిటీ పాడుగాను. ఈసారి మజ్జిగతో పాటు టోపీలు కూడా  సరఫరా చేసేస్తున్నాడు. నాకో మంచి ఆలోచన తట్టింది. అబ్బే కవిత గురించి కాదు, సామాజిక సేవా కాదు.

“ఓ స్పూను జీలకర్ర పొడి, రెండు కరివేపాకు రెబ్బలు, నాలుగు అల్లం ముక్కలు వేసి మజ్జిగ తీసుకురా” అని ఆర్డరేసాను.  సాదా దోసెలా మజ్జిగకి చిటికెడు ఉప్పు మాత్రం తగిలించి బల్ల మీద ఏమాత్రం చిందకుండా ఠక్కున పెట్టి వెళ్ళిపోయింది.

“అలా ఇరవైనాలుగ్గంటలూ ఎ.సి.లో మగ్గకపోతే కాస్త ఎండలోకి వెళ్ళొచ్చుగా”
“ఎండాకాలం మిట్టమధ్యాహ్నం నడిస్తే వచ్చేది డి-విటమిన్ కాదమ్మా డీ-హైడ్రేషన్!”
అయినా బయటకి వెళితే తోపుడు బళ్ళవాళ్ళు, సిటీ బస్ కోసం ఆశ్రయం లేని చోట ఎండలో పడిగాపులు కాసే జనం…  నేను వాళ్ళ కోసం ఏమీ చెయ్యలేను, వాళ్ళ బాధలు చూడలేను.

పిల్లలకి ఒంటిపూట బడులూ ముగిసి ఎంచక్కా వేసవి సెలవులు. వాళ్ళు ఎండలోకి వెళ్ళకుండా కాపాడుకోవడానికి తల్లులు అవస్థలు పడుతున్నారు. దేశంలో ఎవ్వరికీ లేనట్టుగా న్యాయమూర్తుల బుర్రలే వేడెక్కుతాయేమో? న్యాయస్థానాలకీ సెలవులే. మా ఎదురింటి లాయరుగారికి ఉక్కపోసే నల్లకోటు వేసుకునే బాధ తప్పింది. బనీను తొడుక్కుని హాయిగా పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ట్యాంకర్లు అపార్ట్‌మెంట్ వాసుల దాహాగ్నిపై నీటిజల్లు కురిపించడానికి  యుద్ధ ప్రాతిపదికన తిరుగుతున్నాయి. నీడ విలువ లాగే నీళ్ళ విలువ కూడా ఎండాకాలమే తెలిసేది.  మా చిన్నతనంతో పోలిస్తే వీధిపంపుల దగ్గర బిందెల ఆరాటాలు, పోరాటాలు తగ్గుముఖం పట్టాయి. 

మాల్‌లో సేల్స్‌పిల్లకి నిలువుజీతం కష్టంగానే ఉన్నా ఎండాకాలం సుఖంగానే ఉంటోంది.  బేరాలాడ్డానికి వచ్చినవాళ్ళకి ఒక పట్టాన బయటకి వెళ్ళబుద్ధి కావడం లేదు. మా బాల్యంలో ఎండాకాలం ఏ.సి.థియేటర్‌కి నూన్ షోకి వెళ్ళినపుడు మాకూ అలానే అనిపించేది. ఇంట్లో వట్టివేళ్ళ తడికలు తడపడంలో పోటీలు పడేవాళ్ళం. ఆ మట్టివాసన ఎంత బాగుండేదో.  పచ్చడి మావిడికాయల హడావిడి అయితే చెప్పనే అక్కర్లేదు.  ఎండాకాలంలో మూతికీ, ముక్కుకీ అంటుకుంటూ, చేతివేళ్ళ సందుల్లోంచి పళ్ళెంలోకి జారిపోతూ రసాస్వాదన కలిగించేవి మామిడిపళ్ళే.  వాటికి బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరి.

అప్పుడీ పవర్ బేకప్పులూ, ఇన్వర్టర్లూ ఎక్కడివి? విసనకర్రలూ, దినపత్రికలే వింజామరలు.

వాట్సప్పులో, దినపత్రికల్లో, యూట్యూబ్‌లో వచ్చే ఎండాకాలం జాగ్రత్తలన్నీ పాటిస్తూ వడదెబ్బ నుండి కాపాడుకుంటున్నామని సంబరాలు చేసుకుంటున్నారా? మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి.  రోహిణీ కార్తెలా నా కవిత వచ్చేస్తోంది.    

All in a day’s work – 10

1994లో ఆఫీసర్ అవ్వడానికి ముందు 1988-93 మధ్య చెన్నై ఎస్‌ప్లనేడ్ బ్రాంచ్ లో గుమాస్తా పర్వం.
150 మంది స్టాఫ్ తో (80 మంది క్లర్క్స్) స్టాక్ మార్కెట్ లా కళకళ లాడుతూ ఉండేది. పది నుండి ఐదు వరకు పనివేళలు. 
మా బ్యాచ్ ఏడెనిమిది మంది అత్యుత్సాహం గా పనిచేసే వాళ్ళం. మిగిలిన సిబ్బంది మూడింటికే చాలామంది ఇంటిబాట పట్టేసేవాళ్ళు. 
ఆ టైమ్ తర్వాత ఏదైనా క్లిష్టమైన పని, కొత్త పని ఉంటే ఆఫీసర్లు మా బ్యాచ్ కే అప్పజెప్పేవాళ్ళు. కాదనకుండా చేసేవాళ్ళం. ఒకరోజు కుతూహలం కొద్దీ అన్నామలై అనే ఆఫీసర్ ని అడిగేసా.

“అన్నామలై సార్. ఈ పనులు మాకే ఎందుకు అప్పజెబుతారు?”
“శ్రీధర్ సార్. నంబ బ్యాంక్ ల ఒరు పాలసీ ఇరుక్కు. వేల సెయ్యవనుక్కు వేల కుడు. వేలసెయ్యాదవనుక్కు సంబళం కుడు”

“శ్రీధర్ సార్. మన బ్యాంక్ లో ఒక పాలసీ ఉంది. 
పని చేసేవాడికి పని ఇవ్వు.
పని చెయ్యనివాడికి జీతం ఇవ్వు”

బాల్కనీలో దయ్యం

(క్రైమ్ కథలు – 1)

 కారు ఇరవై అంతస్తుల ఆకాశ హర్మ్యం లోపలికి వస్తూనే రావుగారు తల పైకెత్తి ఆ అందమైన బాల్కనీల కేసి చూసారు.


“నమస్కారం రావుగారూ. రండి. సీతారామ్ చెప్పాడు మీరు వస్తున్నారని” ఆహ్వానించాడు మూర్తి.
“పదిహేనో అంతస్తులో ఫ్లాట్ అమ్మకానికుందని తెలిసింది. మాటల్లో సీతారామ్ చెప్పాడు ఈ ఫ్లాట్స్‌లోనే  తనకి తెలిసిన వాళ్ళు… అంటే మీరు ఉంటున్నారని”
“మీకు స్వంత విల్లా ఉందని చెప్పాడే సీతారామ్” 
“ఫాక్టరీకి దగ్గరగా ఉంటుందని ఊరికి దూరమైనా అక్కడే ఒక విల్లా కొన్నానండి. నాకు సభలు, సమావేశాలు అంటే ఆసక్తి.  మాటిమాటికీ సిటీకి రావడం కష్టంగా ఉంది. డ్రైవర్‌ని నమ్ముకోలేం. అందుకే ఈ ఫ్లాట్ కొందామనుకుంటున్నా. మా  అబ్బాయి సందీప్ యూ.ఎస్. నుండి వచ్చేస్తున్నాడు. వాడూ, కోడలు ఆ విల్లాలో ఉండి ఫాక్టరీ పనులు చూసుకుంటారు.   నేను పదవీ విరమణ చేసినట్టే అనుకోండి”
“కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి…”
“ఫ్లాట్ చూస్తా మాట్లాడుకుందామా?” 
 ఫ్లాట్ అంతా కలియతిరుగుతూ బాల్కనీలోకి వచ్చారు.
“నేను చెప్పాలనుకున్న విషయం. నాలుగేళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది”
“ఇంటి యజమానుల కూతురా?”
“కాదు అద్దెకున్నవాళ్ళే. తండ్రీ, కూతురే ఉండేవారు. తల్లి లేదనుకుంటా. హైదరాబాద్‌కి వచ్చి మహా అయితే రెండు నెలలు ఉన్నారేమో. వాళ్ళ గురించి ఎవరికీ వివరాలేం తెలియవు. అయితే ఆ అమ్మాయి వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయి విడుదలైందట. ఆ అవమానంతోనే ఆత్మహత్య చేసుకుందంటారు. తండ్రి ఇల్లు ఖాళీ చేసి ఏదో వృద్ధాశ్రమంలో చేరాడని విన్నాము”
“ఈ కాలం ఆడపిల్లలు ఇలానే ఉన్నారండి. విలాసాలకి అలవాటు పడడం, డబ్బు కోసం బరితెగించడం. సాంప్రదాయం, విలువలనేవి లేవు. అయితే నాలుగేళ్ళ నుండి ఫ్లాట్ ఖాళీగానే ఉందా”   
“లేదండీ. ఆ సంఘటన జరిగిన తర్వాత సంవత్సరం ఖాళీగా ఉంది. తక్కువకి వస్తోందని అప్పుడొక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు కొన్నారు. కానీ ఆర్నెల్లకే ఆయన కూడా ఈ బాల్కనీలో పైన వేలాడదీసిన కుండీల్లో పువ్వులు కోస్తూ జారి కిందకు పడిపోయి… ఆ చనిపోయిన అమ్మాయి దయ్యమై ఈ బాల్కనీలోనే తిరుగుతూ ఉంటుందంటారు. అందుకే ఆ సి.ఐ. గారి కుటుంబం మార్కెట్ ధరకి సగానికే అమ్మకానికి పెట్టారు. మీరు మా సీతారామ్‌కి బాగా కావలసినవాళ్ళు. అందుకే ఇవన్నీ చెప్తున్నాను”
“నాకు ఈ నమ్మకాలు అస్సలు లేవండీ. పైగా ఇటువైపు వెళుతున్నపుడల్లా నన్ను బాగా ఆకర్షించేవి ఈ అందమైన బాల్కనీలే. ఫ్లాట్ యజమానుల వివరాలు ఇవ్వండి. నేను డీల్ మాట్లాడుకుంటాను”

 ఆ సి.ఐ. కూడా ఎప్పుడూ బాల్కనీలోనే కూర్చునేవాడంటారు అనుకున్నాడు మూర్తి. 

 ***

 సందీప్ యూ.ఎస్. నుండి అత్యవసరంగా తిరిగొచ్చి జరగవలసినవన్నీ పూర్తి చేసాడు. తాళాలు హాండోవర్ చేసుకుని ఫ్లాట్ అంతా కలియతిరుగుతూ బాల్కనీలోకి వచ్చాడు.  బాల్కనీ నిజంగానే ఆకర్షణీయంగా ఉంది. రెయిలింగ్ మీద చేతులు పెట్టి ఆలోచిస్తున్నాడు.

‘నాన్న ఫ్లాట్ ఇలాంటిదని తెలిసీ ఎందుకు కొన్నారు? ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటున్నపుడు బాల్కనీలోకి వచ్చి జారి కిందకు పడిపోయి చనిపోవడమేమిటి?’ బుర్ర నిండా సమాధానం దొరకని ప్రశ్నలు.  

అతడికి హఠాత్తుగా శ్వేత గుర్తుకు వచ్చింది. తనని నమ్మి విశాఖపట్నం బీచ్ రిసార్ట్‌లో సర్వస్వం అర్పించిన శ్వేత. తమ విషయం తెలిసి తండ్రి అక్కడ ఎవరో పెద్దమనిషిని ఆశ్రయించాడు. ఆయన పంపిన పోలీసులు రైడ్ చేసి లాక్కుపోతుంటే “మనం ప్రేమికులమని చెప్పు సందీప్” అని ప్రాధేయపడిన శ్వేత. తనని కావాలని తప్పించిన పోలీసులు. ఆ శ్వేతేనా ఇక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది? రైడ్ చేసిన ఆ సర్కిల్ ఇన్‌స్పెక్టరేనా తర్వాత ఈ ఫ్లాట్ కొన్నది? తరువాతి వంతు నాన్నదయిందా?’   

‘బాల్కనీలో దయ్యం?’
‘అంటే ఇప్పుడు…?’ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. 
అతడిని ఎవరో వెనకనుండి కాళ్ళ మడమల దగ్గర గట్టిగా పట్టుకుని బలంగా పైకి లేపుతున్నారు.  

(దయ్యాలు ఉన్నాయని నమ్మను కానీ ఇలాంటి దయ్యాలుంటే బాగుంటుంది అనిపిస్తుంది) 

Posted on fb on 07.05.2023

All in a day’s work – 9

(బహుత్ బఢియా)

ఎలా ఉన్నారు అని మనవాళ్ళని అడిగితే సాధారణంగా వచ్చే జవాబులు… “పర్వాలేదండి”, “బానే ఉన్నా”, “ఆ ఏదో అలా ఉన్నాం” అనో లేకపోతే కష్టాలు ఏకరువు పెట్టడమో జరుగుతుంది.

భువనేశ్వర్లో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నపుడు ఖాతాదారుల్ని ‘ఎలా ఉన్నారు? వ్యాపారం ఎలా ఉంది?’ అని పలకరించినప్పుడల్లా ‘బహుత్ బఢియా’ అనే చెప్పేవాళ్ళు. ఆ పాజిటివిటీ చూస్తే నాకు చాలా ముచ్చటేసేది. ఈ ముచ్చటని నా ఒడియా మిత్రుడితో పంచుకుంటే అతను నవ్వేసాడు.

“అలా చెప్తేనే కదా మీరు వాళ్ళకి లోన్స్ ఇచ్చేది” అన్నాడు.

(అతను సరదాగా అన్నా వాళ్ళ జీవన విధానం అలా ఆశావాద దృక్పధంతో నిండి ఉంటుంది)

All reactions:

16Anil Atluri, Bommireddy Kamalakarreddy and 14 others

All in a day’s work – 8

In banks, the award staff (Clerical & subordinate) have fixed working hours, usually from 10 a.m. to 5 p.m., but not so for the officers.

The training sessions for the staff are held at Staff Training Centres, mostly in big cities, for a period of 3 days to a week. The officers feel a bit relaxed during those sessions. The executives from the administrative offices visit the training centres and interact with the trainees for an hour or so.

“Sir, we are not able to see the sunset on any day” one of the officers complained to one such executive indirectly hinting at the unregulated working hours.

“Not an issue gentleman. Every day around 5 O’clock in the evening… go outside, enjoy the sunset and come back to work” came the ruthless reply.