రెడ్ సిగ్నల్! 

రెడ్ సిగ్నల్! 

సిగ్నల్ వ్యవస్థ ఉన్నా పోలీసుల అవసరం ఉందంటేనే మనది క్రమశిక్షణ లేని సమాజం అని అర్థం.  సిగ్నల్స్ దగ్గర, వాహనం నడిపే విధానం చూసి మనుషుల్ని కొంతమేరకు వర్గీకరించొచ్చు.

బాగా రద్దీగా ఉన్న రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వంకర్లు తిప్పుతూ అన్ని లేన్స్‌లో వెళుతున్న ఎదుటి వాహనాలను అధిగమిస్తూ విన్యాసాలు చేసేవాళ్ళు. వీళ్ళు ఉగ్రవాద మూక (terrorists). వీళ్ళకి తమ ప్రాణాలు కానీ, ఎదుటివాళ్ళ ప్రాణాలు కానీ లెక్క ఉండదు.  జీవితంలో లక్ష్యం లేని వ్యక్తులు.  

ఒకడు నిబంధనల్ని అతిక్రమించగానే నలుగురు అదే పని చేస్తారు.  గొర్రెలు. 

అపసవ్యమార్గం (wrong route) లో వెళ్ళేవాడు తను తప్పు చేస్తున్నాని అనుకోడు. కానీ అతను సవ్యమార్గంలొ వెళుతున్నపుడు అపసవ్యమార్గంలో వస్తున్న వ్యక్తి వల్ల నష్టం వాటిల్లితే నానా రభస చేస్తాడు.   హిపోక్రాట్. 

వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడేవాడు – తనో మల్టి టాస్కర్ అనుకునేవాడు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌కి తగినవాడు. 

ట్రాఫిక్ ఎంతసేపు కదలకపోయినా ఇంట్లో పడక్కుర్చీలో పడుకున్నంత తీరికగా వేచి ఉండేవాడు. సహనశీలి లేదా స్థితప్రజ్ఞుడు.

హెల్మెట్ లేకుండా వెళ్ళేవాళ్ళని “బాబూ అటు పోలీసులు ఉన్నారు” అని హెచ్చరించేవాడు. సంఘద్రోహి. తనని తాను సమాజ సేవకుడిగా భావించుకునేవాడు.

ట్రాఫిక్ జామ్ అయితే…..
పోలీసులకి ఫోన్ చేసేవాడు –  కర్తవ్య పరాయణుడు.
జామ్‌కి కారణమేమిటని కనుక్కుని సరిదిద్దడానికి ప్రయత్నించేవాడు – సమాజ సేవకుడు.
అలా చేసి నీకెందుకోయ్ అని తిట్లు తినేవాడు – తనకు మాలిన ధర్మాన్ని పాటించేవాడు.

గ్రీన్ సిగ్నల్ పడగానే ముందు ఉన్న వాహనాలు కదలడానికి కొంత సమయం పడుతుందని తెలిసినా హారన్ మోగించేవాడు – అసహన జీవి.  వీళ్ళకు పైల్స్ వ్యాధి సంక్రమించుగాక!   

గ్రీన్ నుండి సిగ్నల్ యెల్లో్‌కి మారుతూనే…
బండి ఆపేసి వెనకనుండి మరో వాహనంతో గుద్దించుకునేవాడు –  సమాజ పోకడల్ని అర్థం చేసుకోనివాడు.
బండి ఆపకుండా సిగ్నల్ దాటేసేవాడు – రిస్క్ మేనేజర్. తన తప్పుని ఎప్పటికీ ఒప్పుకోనివాడు, నష్టం వాటిల్లినా సరే!    

రెడ్ సిగ్నల్ పడినా దాటేసేవాడు – అరాచకవాది.  
నిబంధనలు అతిక్రమించాడని పోలీసులు ఆపితే మొబైల్ తీసేవాడు – బాగా పలుకుబడి ఉన్నవాడు.
జీవితంలో రెడ్ సిగ్నల్ ఎవరికి వాళ్ళు వేసుకోగలగాలి!  ఈసారి సిగ్నల్స్ దగ్గర మనం ఎవరో అందాజా వేసుకుందామా?