పుట్టినరోజు

 

ఇది నా పుట్టినరోజు.. ఈ చిరంజీవి పుట్టినరోజు అని నగేష్‌లా పాడడానికి ఇక్కడ ఎవడూ చిరంజీవిగా ఉండిపోడు.

పుట్టినరోజు.. చదివుంటే పదో తరగతి సర్టిఫికేట్, డబ్బుంటే పాన్ కార్డ్, విదేశం వెళ్ళాలనుకుంటే పాస్‌పోర్ట్, వాహనం  నడుపుతుంటే లైసెన్స్ మీద, ఏ ఆధారమూ లేనివాడి ఆధార్ కార్డ్ మీద  కనిపిస్తుంది.

పుట్టినరోజు.. ఉద్యోగం ఉంటే విరమణ చెయ్యడానికి,  వైద్యుడికి మన వయసు చెప్పడానికి పనికొస్తుంది.  దాని ప్రాముఖ్యత అంతే, అంతవరకే.  పుట్టినరోజు తెలీకపోతే పెట్టుడు ముహుర్తాల్లాగే జనవరి ఒకటో, ఆగస్ట్ పదిహేనో పెట్టుడు రోజులు ఉంటాయి. తమ పుట్టినరోజు సాధారణంగా అందరికీ తెలుస్తుంది.  పుట్టి మునిగే రోజే తెలియదు.

జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే, పటాటోపం లేకుండా చెప్పాలంటే – వెనక్కి తిరిగి చూసుకుంటే.. నాకు రానివి, తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి.  

బొమ్మలు గీయడం, ఆటలు ఆడడం, పాటలు పాడడం, సంగీతంలో ఓనమాలు (సరిగమలు), నాట్యం చెయ్యడం, రంగస్థలం/సినిమా తెరపై నటించడం,  గొప్పగా ఉపన్యాసాలివ్వడం, చర్చల్లో పాల్గొనడం, మనసు మర్మం, మానవ శరీర నిర్మాణం ఇతరత్రా అనేకానేక శాస్త్రాలు.. ఇలా.  కుమ్మరి, కమ్మరి, నేత, వడ్రంగి, కట్టుబడి, కుట్టుపని, కరెంటు, వ్యవసాయం, వ్యాపారం ఏవీ తెలియవు.

ఇవే కాదు… రానివి, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. 

అన్యాయానికి ఒడిగట్టడం, మోసం చెయ్యడం, లంచం తీసుకోవడం, అవహేళన చెయ్యడం, వివక్ష చూపడం,  జీవితాల్తో ఆడుకోడం, ఇంకొకడి నెత్తిన నాట్యం చెయ్యడం, చెడగొట్టు పని, పనికిమాలిన కబుర్లు చెప్పడం, హిపోక్రసీ, జీవితంలో నటించడం, రాజకీయం చెయ్యడం (ఇప్పటి అర్థంలో)..  ఇలా.

… కిందకి అరవై ఏళ్ళు వచ్చినా మరి నువ్వు నేర్చుకున్నదేమిటి అని మీరడగొచ్చు.

పై వరుసలో చెప్పినవి వచ్చినవాళ్ళ ప్రతిభని ఆస్వాదించడం..రెండో వరుసలో చెప్పినవి ఆచరించేవాళ్ళని చూసి జాలి, బాధపడడం..

సమస్త విశ్వాన్ని, సకల చరాచర జీవరాశుల్ని ప్రేమించడం.

అసలు ఎవడైనా పుట్టాక ఏమీ సాధించవలసిన అవసరం లేదు. ఎవరినీ సాధించకుండా ఉంటే చాలు.  తలిడండ్రులూ-పిల్లలూ, మొగుడూ-పెళ్ళాలూ, అత్తా-కోడళ్ళూ  ఒకళ్ళనొకళ్ళని, వైద్యులు రోగుల్ని, రానాలు-ఉద్యోగులు ప్రజల్ని,  వ్యాపారస్తులు కొనుగోలుదారుల్ని ఇలా సాధించకుండా ఉంటే చాలు.  బాధించబడుతున్న ప్రజవైపు ఉంటే ఇంకా మంచిది.

నేను అందుకే పుట్టాను అనుకుంటాను.

శాహా Vs. మాహా

ఈ కథ ఆగస్ట్ 2010లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం అనూస్ హాస్టల్స్‌తో కలిసి నిర్వహించిన కథావసంతం – పది కథలు ఒక్కో కథకి పదివేలు బహుమతి అని పెట్టిన కథల పోటీలో బహుమతి గెలుచుకుంది.

పుట్టిల్లు

ఈ కథ ఈమాట వెబ్ మాసపత్రిక నవంబర్ 2021 సంచికలో ప్రచురించబడింది.
కథకి లింక్: https://eemaata.com/em/issues/202111/27201.html

కథ నచ్చితే లైక్ చెయ్యడానికి/కామెంట్ చెయ్యడానికి లింక్ లో సదుపాయం ఉంది.